Monthly Archives - February 2011

Breaking News

నేటి నుంచి కేస్లాపూర్‌ నాగోబా జాతర

Keslapur Nagoba Templeఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్‌లో నాగోబా జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది. అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జాతరకు గిరిజనులు తరలి వస్తున్నారు. ప్రతి సంవత్సరం పుష్యమ అమావాస్య అర్థరాత్రి జాతర ప్రారంభమవుతుంది. జిల్లాలోని గిరిజనులతో పాటు అనేక ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తారు. గంగాజలం కోసం కాలినడకన వెళ్ళిన మెస్రం వంశీయులు ఇంద్రవెల్లికి చేరుకొని ఇంద్రాయి వద్ద పూజలు నిర్వహించడంతో సంబరాలు ఆరంభమయ్యాయి. ఈ నెల 2న ప్రారంభమయ్యే జాతర 13వ తేదీతో ముగుస్తుంది. భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు ఐటిడిఎ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు.

చరిత్ర
పూర్వకాలంలో మెస్రం కుటుంబానికి చెందిన నాగాయిమోతి రాణికి నాగేంద్రుడు కలలో కనిపించి సర్పరూపంలో ఆమె గర్భాన జన్మిస్తానని చెప్పాడని ఆ కల నిజమైందని గోండుల నమ్మకం. సర్ప రూపంలోని నాగేంద్రుడికి తల్లి తన తమ్ముడి కూతురైన గౌరితో వివాహం జరిపిస్తుంది. అత్త ఆజ్ఞ మేరకు గౌరి తన భర్త నాగేంద్రున్ని బుట్టలో పెట్టుకొని గోదావరికి వెళుతుంది. సర్పం ఓ చోట ఉడుం రూపంలో కనిపించడంతో ఉడుంపూర్‌ ఆ తరువాత గౌరి గోదావరి నదిలో స్నానానికి వెళ్ళగా ఆమెను చూసి నాగేంద్రుడు మనిషి రూపంలోకి మారాడని అయితే పేరు ప్రతిష్టలు కావాలో సంప్రదాయం కావాలో తేల్చుకోమనగా గౌరి సంప్రదాయాలను లెక్క చేయకపోవడంతో తిరిగి నాగేంద్రుడు సర్పరూపంలోకి మారాడానే కథ ప్రచారంలో ఉంది. నాగేంద్రుడి కోసం ఉడుంపూర్‌ నుంచి గరిమ్మెల వరకు వెతికిన గౌరి గోదావరిలోని సత్యవతి గుండంలో కలిసిపోయిందని, ఆమె వెంట నాగేంద్రుడు ఉంచిన ఎద్దు రాయిగా మారిందని పెద్దలు చెబుతుంటారు. ఆ తరువాత పెళ్ళి అయిన ప్రతి జంటకు నాగేంద్రుని సన్నిధిలో పరిచయం చేయాలని చెప్పి నాగేంద్రుడు కేస్లాపూర్‌ గుట్టలోకి వెల్ళిపోవడంతో అక్కడ నాగోబా వెలిసిందని చరిత్ర ప్రచారంలో ఉంది.

పూజలు ఇలా ఉంటాయి
జాతర ప్రారంభానికి ముందు మెస్రం వంశీయులు జన్నారం మండలం కలమడుగు గోదావరి రేవులోని అస్తలమడుగు నుంచి కాలినడకన గంగాజలం తీసుకొచ్చి ఇంద్రవెల్లిలోని ఇంద్రాయిదేవికి ప్రత్యేక పూజల అనంతరం కేస్లాపూర్‌ చేరుకుంటారు. నాగోబా ఆలయానికి సమీపంలో ఉన్న మర్రిచెట్ల వద్ద విడిది చేస్తారు. ఆ సమయంలో గంగాజలంను చెట్టు కొమ్మకు కట్టి ఉంచుతారు. పుష్యమాస అమావాస్య అర్థరాత్రి గంగాజలంతో నాగోబాకు అభిషేకం చేస్తారు. ఆలయంలో ఏడు పుట్టలు తయారు చేసి నవధాన్యాలు, ఆవుపాలు, నైవేద్యంగా పెడతారు. ఇచ్చోడ మండలం సిరికొండలో ప్రత్యేకంగా తయారు చేసిన 116 మట్టికుండలను తీసుకొచ్చి పూజల అనంతరం మెస్రం ఆడపడుచులు మర్రిచెట్టు సమీపంలోని బావి నుంచి వాటిలో నీటిని తీసుకొచ్చి ఆలయానికి చేరుకుంటారు. గతంలో నిర్మించిన పుట్టలను తొలగించి ఆవుపేడ, జలంతో మట్టి పుట్టలు నిర్మిస్తారు. అనంతరం కిక్రీ, డోలు తదితర వాయిద్యాలతో పెద్దలు కచేరీలు నిర్వహించారు. మెస్రం వంశం కింద 22 తెగలు ఉంటాయి. ఏడుగురు దేవతలను కొలిచే వారంతా మెస్రం వంశీయుల కిందికి వస్తారు. మడావి, మర్సుకొల, పుర్క, మెస్రం, వెడ్మ, పంద్రా, ఉర్వేత ఇంటిపేర్లు గలవారు మెస్రం వంశీయులు, వీరే పూజారులుగా వ్యవహరిస్తారు. పూజరులను మూడు సంవత్సరాలకు ఒకసారి మార్చడం ఆనవాయితీ. ఈ సందర్భంగా వారు కొత్వాల్‌, మెస్రం వంశంలో 22 తెగల వారిని పేరు పేరున స్మరించుకుంటారు. నాగోబాకు పూజలు నిర్వహించే మెస్రం వంశీయులు ఆలయం వద్ద ఉన్న గోవడలో విడిది చేస్తారు. ఈ గోవడలో 22 కిత్తలతో విడిది చేసి నాగోబా జాతర ముగిసే వరకు పూజలు నిర్వహించారు. మెస్రం వంశంలో పెళ్ళిళ్ళు జరుగగానే ఇంటికి వచ్చే కోడళ్ళను వెంటనే వంశస్తురాలుగా గుర్తించరు. నాగోబా సమక్షంలో బేటింగ్‌ నిర్వహించాకే వారి వంశపు కోడళ్ళుగా గుర్తింపు ఇస్తారు. దీని కోసం ప్రతి సంవత్సరం నాగోబా పూజల అనంతరం ఆలయంలో బేటింగ్‌ నిర్వహిస్తారు. ఆలయంలో తయారు చేసి పుట్ట వద్ద నూతన దంపతులతో ప్రత్యేక పూజలు జరిపిస్తారు. నాగోబా దర్శనం అనంతరం మెస్రం వంశంలోని కుల పెద్ద భార్య, కోడళ్ళను వంశస్తులకు పరిచయం చేయిస్తారు. అప్పటి నుంచి వారిని మెస్రం వంశం కోడళ్ళుగా గుర్తిస్తారు.

విగ్రహాల ప్రతిష్టాపన
ఫిబ్రవరి 2 నుంచి జరిగే కేస్లాపూర్‌ నాగోబా జాతరలో నూతన విగ్రహాలు ప్రతిష్టించనున్నారు. సుమారు 25 సంవత్సరాల క్రితం ప్రతిష్టించిన నాగోబా విగ్రహ స్థానంలోనే ఈ విగ్రహం ఏర్పాటు చేయనున్నామని దేవస్థానం పటేల్‌ వెంకట్రావు తెలిపారు. పురాతన విగ్రహానికి మరమ్మత్తులు రావడంతో 40 కేజీల ఇత్తడితో విగ్రహం రూపొందించామని, తయారీకి రూ.60వేలు వెచ్చించినట్లు పేర్కొన్నారు.