ఎక్కడికక్కడే…

Breaking News

ఎక్కడికక్కడే…

mancherial-ib-trsపార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ శ్రేణులు రహదారులపై రాస్తారోకో నిర్వహించారు. తెలంగాణ జేఏసీ ఇచ్చిన పిలు పు మేరకు రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ రహదారులను దిగ్బంధించారు. ఆదిలాబాద్ శివారుల్లోని జైనథ్ మండలం పెన్‌గంగా వద్ద ఎన్‌హెచ్-7 పై తెలంగాణ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుపైనే వంట చేసి ఆరగించారు. ఆదిలాబాద్ రైల్వే స్టేషన్‌లో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో రైల్‌రోకో నిర్వహించారు. నిర్మల్ శివారులోని సోన్ వద్ద జాతీయ రహదారిపై నాలుగు గంటలు రాస్తారోకో నిర్వహించారు. వంటవార్పు చేసి నిరసనలు తెలిపారు. ఆసిఫాబాద్, కాగజ్‌నగర్‌లోని అంతరాష్ట్ర రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. మంచిర్యాల ఐబీ చౌరస్తా వద్ద రాస్తారోకో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అరవింద్‌రెడ్డి, జేఏసీ నాయకులు ఆందోళన నిర్వహించారు.

దండేపల్లి, హాజిపూర్‌లో రాస్తారోకోలు జరిపి రోడ్లపై వంటావార్పు చేశారు. అదేవిధంగా రెండు గంటలు రోడ్డు దిగ్బంధనం చేశారు. టీఆర్‌ఎస్ తూర్పు జిల్లా అధ్యక్షులు పురాణం సతీశ్‌కుమార్ ఆధ్వర్యంలో చెన్నూర్‌లో రోడ్లను దిగ్భందం చేశారు. తాండూర్, కాసిపేట, నెన్నెల, భీమిని, వేమనపల్లిలో రోడ్డుపై చకినాలు చేసి నిరసన తెలిపారు. భైంసా, ముథోల్, తాండూర్, మాటేగాం, కల్లూర్, బోసీలలో రాస్తారోకోలు నిర్వహించారు. కాగజ్‌నగర్ ఎన్టీఆర్ చౌరస్తా వద్ద సిర్పూర్ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య ఆధ్వర్యంలో జొన్న గటుక, చేపలపులుసు పంచి పెట్టి నిరసన తెలిపారు. ఆసిఫాబాద్‌లోని అంతరాష్ట్ర రహదారిపై శ్రీకృష్ణ కమిటీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కెరమెరిలో శ్రీకృష్ణ కమిటీ శవయాత్రను నిర్వహించారు.

నిర్మల్‌లో శివాజీచౌక్ ఆర్టీఓ కార్యాలయం ఎదుట తెలంగాణశ్రేణులు ఆందోళన నిర్వహించారు. లక్సెట్టిపేటలో మండల శాఖ రాజకీయ జేఏసీ కన్వీనర్ నైనాల గోవర్దన్ ఆధ్వర్యంలో కనకపూర్, మామడలో రాస్తారోకో నిర్వహించారు. సారంగపూర్ మండలం దిలావర్‌పూర్, ఉట్నూర్, ఇంద్రవెల్లి, జన్నారంలలో రాస్తారోకోలు నిర్వహించారు. ఆంధ్ర సరిహద్దులోని బోథ్, తలమడుగు మండలాల్లో రాస్తారోకోలు నిర్వహించారు. తెలంగాణ సాధన కోసం ఏఐటీయుసీ సిద్ధమైంది. సింగరేణి సంస్థల్లో కార్మికులు నల్లాబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. కాసిపేట, బెల్లంపల్లి సింగరేణి కార్మికులు నిరసన తెలిపారు. మంచిర్యాలలో తెలంగాణ కళాకారులు ధూంధాం కార్యక్రమాన్ని నిర్వహించారు. మందమర్రిలో తెలంగాణ కోసం మల్లేశ్ అనే యువకుడు చేయి కోసుకున్నాడు.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *